ధర్మసందేహాలు :

OMKARAM GURUJIAstrology

ధర్మసందేహాలు :

0 Comments

1.పూజాదికాలు చేస్తున్నప్పుడు మధ్యలో తుమ్మువంటివి వస్తే, పూజ నిష్ఫలమా?
జ: శాస్త్రరీత్యా పూజాదికాల సమయంలో కన్నీరు కారినా, క్రోధం కలిగినా, అపాన వాయువు, తుమ్ము వంటివి కలిగినా, అశౌచులను చూసినా ఆచమనం చేస్తే ఆ దోషాలు పోతాయి. అదే విధంగా కుడి చెవిని కుడిచేతితో తాకాలి.

  1. మనం రోజును ఎలా లెక్కిస్తాం ? అర్ధరాత్రి 12 తరువాత తేదీ మారినట్లు , అప్పుడే మనకి రోజు మారుతుందా?
    జ: మనకి సూర్యోదయం నుండి సూర్యోదయం వరకు ఒకరోజు క్రింద లెక్క, అర్ధరాత్రి లెక్కకి లేదు. సూర్యోదయమే ప్రధానం. ‘ఉదయాదుదయం వారం’ అని శాస్త్రం.
  2. ‘ప్రాతఃస్మరణీయులు’ అంటే ఏమిటి? వారెవరు?
    జ: ప్రాతఃకాలాన్నే నిద్ర లేస్తూ పవిత్రమైన, దివ్యమైన వస్తువుల్నీ, మహాపురుషుల్ని స్మరించుకోవడం భారతీయ సనాతన ధర్మం. ఉదయానికి పూర్వకాలం ఆ రోజు ఆరంభం. ఆ సమయంలో మంచిని తలచుకుంటే దినమంతా మంచే జరుగుతుందని భావన. ప్రాతఃకాలాన ముందుగా, శయ్యమీదే కూర్చొని అరచేతిలో ముగ్గురమ్మలనీ భావనచేసి నమస్కరించి, ఆ తరువాత ఇష్టదైవాన్నీ, దేవతలనీ స్మరించాలి. అటు పిమ్మట వసిష్ఠాది మహర్షులనీ పృథు మాంధాత రఘు మొదలైన మహాచక్రవర్తులనీ ప్రహ్లాదాది పరమ భాగవతులనీ, హిమవత్పర్వతాది పుణ్యగిరులనీ, గంగాది పావన నదులనీ తలంచుకొని నమస్కరించాలి. అటుతరువాత భూమాతకి నమస్కరించి శయ్య నుండి దిగాలి. ఇలా ప్రాతఃకాలంలో స్మరించదగినవారిని ‘ప్రాతఃస్మరణీయులు’ అంటారు. అలాంటి పుణ్యచరిత్ర గలవారిని కూడా ఆ పేరుతో గౌరవించడం సంప్రదాయం.
  3. నది- నదం ఈ రెండింటికీ తేడా ఏమిటి?
    జ: తూర్పు దిక్కు వైపు ప్రవహిస్తూ పోయి, తనంత తానే సముద్రంలో కలిసేది – నది. పడమటి దిక్కున ప్రవహిస్తూ వెళ్ళి, అక్కడ నదితో చేరి, సముద్రంలో కలిసేది ‘ నదం’.
  4. మా ఇంట్లో బోర్వెల్ సదుపాయంగానీ, నుయ్యిగానీ లేదు. మున్సిపల్ పంపుల మీదనే ఆధారపడవలసి వస్తోంది. ఆ నీరునే పట్టి సంపులలో దాచుకోవాలి. మరి పూజలకి నీళ్లు వాడుకోవాల్సినప్పుడు, శుచిగా ఎలా సాధ్యం? నిత్యకర్మలు చేయడం ఎలా కుదురుతుంది?
    జ: మనకి దొరకే నీటినే పూజలకు వినియోగించుకోవాలి. సాధ్యమైనంత వరకు శక్తివంచన లేకుండా నియమాలను పాటించాలి. సాధ్యం కానిది ఎలాగూ చేయలేం. సాధ్యమైన మేరకు శుచిగల జలాన్ని సేకరించి, ఆ దొరికిన దానిలోనే ‘గంగ, యముగా, గోదావరి’ లాంటి పుణ్యనదుల్ని భావనచేసి, ఇష్టదేవతా స్మరణ చేసి వినియోగించాలి. అంతేగానీ నిత్యకర్మానుష్టానం మానరాదు.
  5. కొత్త తులసి మొక్కను పాతడానికిగానీ, మార్చి వేయడానికి గానీ మంచి రోజులు చూడాలా?
    జ. శాస్త్రరీత్యా ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి, కార్తిక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్యాలంటారు. ఆ రోజుల్లో కొత్తగా తులసి మొక్కను మార్చి పాతడం కూడదు. ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, అమావాస్య, శుక్రవారాలలో తులసిని కోయరాదు.
  6. నాకు పీడకలలు ఎక్కువ వస్తుంటాయి. అవి రాకుండా ఉండాలంటే, వాటి ప్రభావం లేకుండా చేయాలంటే ఏం చేయాలి? అసలు కలలు నిజమౌతాయా? పగటి నిద్రలో కలలు నిజమౌతాయంటారు కదా’
    జ: ‘దుస్స్వప్నే స్మర గోవిన్దం’ అంటారు. గోవింద నామస్మరణ చేసి, నిద్రపోతే పీడకలలు రావు. వచ్చినా వాటి ప్రభావం ఉండదు. గజేన్ద్రమోక్ష ఘట్టాన్ని, త్రిమూర్తులనీ తలచుకొని నిద్రించడం, తిరిగి లేస్తూనే వాటిని స్మరించడం చేస్తే దుస్స్వప్న ప్రభావం ఉండదు. ఉదయానే దూర్వాలతో గణేషుని అర్చించినా మేలుకలుగుతుంది. ‘పుణ్యో దుస్స్వప్న నాశనః’ నారాయణుడు దుస్స్వప్ననాశకుడని విష్ణు సహస్రనామాలలోనే పేర్కొన్నారు. పగటి నిద్రలో, వాతప్రకోపాలలో వచ్చే కలల వల్ల ప్రయోజనం లేదు.
  7. నవబ్రహ్మలు అంటే ఎవరో వివరిస్తారా?
    జ: బ్రహ్మదేవుని నుండి ఉద్భవించిన ప్రజాపతులు తొమ్మిది మంది. వీరు సృష్టి విస్తరణకై బ్రహ్మ ద్వారా కలిగినవారు. వీరినే ప్రజాపతులు అంటారు. మరీచి, అత్రి, అంగీరస, పులస్త్య, పులహ, క్రతు, భృగు, వసిష్ఠ, దక్ష.
  8. మంగళవారం వంటి రోజుల్లో తలస్నానం చేయరాదనీ, నూతన వస్త్రాలు ధరించరాదని అంటారు కదా? మరి పర్వదినాలు ఆ రోజుల్లో పడితే ఏం చేయాలి?
    జ: పర్వదినాలు పడిన ఏ రోజైనా ఆ నియమం వర్తించదు. మంగళవారమైనా ఆ రోజు తలస్నానం చేయవచ్చు. నూతన వస్త్రాలు ధరించవచ్చు.
  9. ‘విశ్వేదేవతలు’ అంటే ఎవరు? వీరి ప్రత్యేకత ఏమిటి? వీరెంతమంది?
    జ: విశ్వేదేవతలు పదిమంది. ‘విశంతి కర్మసు – ఇతి విశ్వే’ – ఆయా కర్మానుష్టానాలలో ఆరాధింపబడేవారిగా ప్రవేశమును పొందినవారు. వీరు ‘విశ్వా’ అనే ఆమెకు పుత్రులు. కర్మానుష్ఠానాలలో వీరిని ఆరాధిస్తారు.

‘వసుః సత్యః క్రతుర్దక్షః కాలః కామో ధృతిః కురుః
పురూరవా మాద్రవాశ్చ విశ్వేదేవా దశస్మృతాః ||’

‘వసువు, సత్యుడు, క్రతువు, దక్షుడు, కాలుడు, కాముడు, ధృతి, కురు, పురూరవుడు, మాద్రవుడు… ఇవీ వారిపేర్లు.

  1. జన్మనక్షత్రంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు?
    జ: జన్మనక్షత్రంలో యాగం, చౌలకర్మ, అన్నప్రాశన, వ్యవసాయం, ఉపనయనం, భూసంపాదన, అక్షరాభ్యాసం చేయవచ్చు. శుభకరం. సీమంతం, గర్భాధానం, క్షౌరకర్మ, ఔషధసేవారంభం, ప్రయాణం చేయరాదు. అశుభం. స్త్రీలకు జన్మనక్షత్రంలో వివాహం చేయడం మంచిదే. పురుషులకు జన్మనక్షత్రాన వివాహం పనికిరాదు.
  2. శివాలయానికి వెళ్ళేటప్పుడు నంది కొమ్ముల నుండి శివుని చూడాలంటారు. ఆ విధానం, చెప్పవలసిన స్తోత్రం ఏమిటి?
    జ: నందీశ్వరుని కొమ్ముల మీద ఎడమచేయి ఉంచి, వెనుక భాగంలో కుడిచేతితో స్పృశించడం చేత అతడు శిరసు వంచుతాడు. అప్పుడు కొమ్ముల నుండి శివుని చూడాలి. పశుపతి అయిన శివుడు, పశువులైన జీవులకు ప్రభువు. ఆ పశుత్వాన్ని దాటి శివుని చూడాలి.

మరియొక భావంలో – నంది ధర్మస్వరూపుడు. ఆ సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ, ధర్మం ద్వారానే దైవాన్ని దర్శించాలనే సంకేతం కూడా ఇందులో దాగి ఉంది.

‘శాంతానంద ప్రదాయక
మహాదేవస్య సేవార్థం
అనుజ్ఞాం దాతుమర్హసి॥’

  • అనే శ్లోకాన్ని పఠిస్తూ ‘హర హర – శివశివ’ అనే శివ నామాన్ని పలుకుతూ, నంది కొమ్ముల మధ్య నుండి శివ లింగాన్ని దర్శిస్తే – వేదపఠనం చేసిన ఫలం, సప్తకోటి మహా మంత్ర జపఫలం లభిస్తాయని, పాప పరిహారం అవుతుందనీ పురాణాలు చెబుతున్నాయి.
  1. అమ్మవారి అష్టోత్తరశతనామాలలో ? ‘భక్త హంసపరీముఖ్య వియోగాయైనమోనమః’ అని 83వ నామం. ఈ నామానికి అర్థం ఏమిటి? కొన్ని పుస్తకాలలో పరీముఖ్య బదులుగా పరాముఖ్య అని ఉంది. ఏది సరియైన పాఠం.
    జ: ‘పరాముఖ్య’ అనేదే సరియైన పాఠం. దీని అర్థం- ‘పరాఙ్ముఖత్వం’. అంటే- ‘పెడమొగముతో ఉండుట’ (విముఖత్వం). భక్తులైన హంసల (పరమహంసలు – యోగులు) పట్ల అమ్మవిముఖంగా ఉండడంలో వియోగం కలది. అంటే విముఖత్వాన్ని కలిగి ఉండదు. భక్తయోగుల పట్ల సుముఖురాలు. ఈ మాటని ఈ విధంగా చెప్పడంలో ఒక అందముంది. ఏ మాత్రము భక్తుల పట్ల విముఖంగా ఉండని తల్లి. యోగుల హృదయంలో అమ్మయే యోగము. అక్కడ వియోగం లేదు. భక్తవాత్సల్య స్వరూపిణి. పరమహంసలలో భాసించే జ్ఞానానందతత్త్వం.
  2. సజాతీయ విజాతీయ స్వగత భేదాలు – అని అంటారు కదా’ అవి ఏమిటి? వివరించ ప్రార్థన.
    జ. ఒకటే జాతిలో రెండు వస్తువులకు గల భేదము ‘సజాతీయ భేదం’. ఉదాహరణకు రెండు రాతి వస్తువులు. ఒక రాతికీ మరో రాతితో గల భేదమిది. వేరు వేరు జాతుల్లో రెండు వస్తువులకున్న భేదం – విజాతీయ భేదం.
    ఉదా: ఒక రాతికి ఒక చెట్టుతో గల భేదం.

ఒకే వస్తువులో ఉన్న భేదం విగత భేదం. తనయందే ఉన్న భేదం.
ఉదా: ఒకే చెట్టులో కొమ్మ, రెమ్మ, ఫలం – వంటి భేదాలు. ఈ మూడు రకాల భేదాలు నామరూపాత్మక ప్రపంచంలోని ఉపాధులలో ఉన్నాయి. ఈ భేదాలు లేని అభిన్న స్వరూపుడు సర్వవ్యాపకుడైన పరమాత్మ. వేదాంత శాస్త్రంలో పరమాత్మ తత్త్వాన్ని తేటపరచే సందర్భంలో ఈ మాటలను వివరించారు.

  1. ‘ఏడుగడ’ అనే మాట ప్రాచీన తెలుగు సాహిత్యంలో కనిపిస్తోంది. ఆ ‘ఏడు’ సంఖ్య దేనికి వర్తిస్తుంది? ఆ పదానికి అర్థం ఏమిటి?
    జ: ‘ఏడుగడ’ అనే మాటకి ‘ఆధారము, ఉనికి’ ప్రధానార్థం. వ్యక్తి ఏడు రకాల ఆధారాల వలన తన జీవితాన్ని నిర్వహించగలడు. తల్లి, తండ్రి, గురువు, పురుషుడు (జీవ చైతన్యం), విద్య, దాత, దైవము – ఈ ఏడు ఉనికికి, మనికికి కావలసినవి. కనుక వీటిని ‘ఏడుగడ’ అంటారు. ఒక శక్తి గానీ, వ్యక్తి గానీ ఈ ఏడురకాలుగా సహకరించినప్పుడు ఆ శక్తినీ, వ్యక్తినీ ‘ఏడుగడ’ అనడం సంప్రదాయం.
  2. దీపం పెట్టేటప్పుడు వత్తి ఏ ముఖంగా ఉండాలి. రాత్రి దీపం ఎంత వరకు ఉండాలి?
    జ: దీపం తూర్పుముఖంగా ఉంటే ఆయుష్షు, ఉత్తరముఖంగా వెలిగిస్తే ధనం లభిస్తుంది. పడమర ముఖంగా, దక్షిణముఖంగా వెలిగించరాదు. పడమర ముఖం దుఃఖాన్ని, దక్షిణముఖం కీడును కలిగిస్తాయి.

రవేరస్తం సమారభ్యయావత్ సూర్యోదయా భవేత్।
యస్య తిష్ఠేత్ గృహే దీపస్తస్య నాస్తి దరిద్రతా॥
సూర్యుడు అస్తమించినది మొదలు, మళ్ళీ సూర్యోదయం వరకు ఇంట్లో దీపం వెలుగుతుండాలి. అలా దీపం వెలిగే ఇంట్లో దరిద్రం ఉండదు.

  1. అబ్దికం చేసేటప్పుడు – చనిపోయినవారి తిథి ఆ రోజు పగలు పదిగంటలకు వచ్చి, మర్నాడు ఉదయం కొన్ని గంటలు మాత్రమే ఉన్నప్పుడు శ్రాద్ధకర్మ ఎప్పుడు చేయాలి?
    జ: ఇది జ్యోతిష – ధర్మ శాస్త్రాల సమన్వయంతో తేల్చ వలసిన అంశం. మీరు అనుసరించే పంచాంగ సంప్రదాయం ప్రకారం నిర్ణయించుకోవాలి. అయితే అపరాహ్న (మధ్యాహ్నం 12 గం ॥) సమయంలో ఉన్న తిథినే గ్రహించాలి కనుక, 10 గంటలకు వచ్చిన తిథి ఉన్న రోజునే ఆబ్దికానికి స్వీకరించాలి.
  2. మహాభారతంలో దుష్యంతుని పుత్రుడు భరతుడు అని ఉన్నది. ఆ భరతుని పుత్రుడు ఎవరు? అదే విధంగా – భీష్ముని తండ్రియైన శంతనునికి తండ్రి ఎవరు? ‘కుఱువంశం’ అనే పేరు ఎందువల్ల వచ్చింది?
    జ: భరతుని పుత్రుడు ‘భుమన్యువు’ – అని భారతం చెబుతోంది. తరువాత కొన్ని తరాల చక్రవర్తులు గడిచాక ‘సంవరణుడు’ అనే భారతవంశీయుని కొడుకు ‘కుఱు’. సంవరణుని కాలంలో రాజ్యాధికార భ్రష్టమై అతడు పరివారంతో సహా పారిపోయి అరణ్యంలో తలదాచుకున్నాడు. తరువాత వసిష్ఠుని దీవెనల వల్ల తిరిగి శత్రువుల్ని జయించి రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. ఆతని పుత్రుడు ‘కుఱు’. పోయిన రాజ్యం తిరిగి వచ్చాక, కలిగిన ఈతడు అనంతర రాజైన కారణంగా ప్రత్యేకించి ఈతని నుండి ‘కుఱు’ పేరుతో వంశ వ్యవహారం నడిచింది. ఈతని పేరుతో ‘కుఱుజాంగలదేశ’మనే ప్రసిద్ధి కూడా వచ్చింది. వీరి తరువాత ఆరవ తరం వాడు శాంతనుడు. అతని పుత్రుడు భీష్ముడు. ‘శాంతనుడు’ అన్నా ‘శంతన’ చక్రవర్తి అన్నా ఒకడే. ఈతని తండ్రి పేరు ప్రతీపుడు.
  3. పూజ అనే మాటకు అర్ధం ఏమిటి?
    జ. ‘పూః యేన జాయతే ఇతి పూజా’ అని పురాణాల్లో నిర్వచనమిచ్చారు. పూః- అంటే ఇష్టసిద్ధి, భోగం అని అర్ధాలు. ఏ కర్మ వలన ఇష్టసిద్ధి లభిస్తుందో దానికి పూజ అని అర్ధం. భగవదర్చన వల్ల అభీష్టసిద్ధి లభిస్తుంది కనుక అర్చనకు ‘పూజ’ అనే శబ్దాన్ని వాడుతారు.
  4. కార్తిక మాసంలో దీపారాధనకు అంత ప్రాధాన్యం ఎందుకుంది?
    జ: కార్తికమాసం అనగానే తెల్లవారుఝామున స్నానాలు, ఉభయసంధ్యల్లో శివకేశవాది ఆలయాలలో దీపారాధనలు, నదులలో, తటాకాలలో దీపాలను విడిచి పెట్టడం… చక్కని సందడి’ ఇందులో దివ్యత్వంతో పాటు ఒక ఉత్సాహం, ఉల్లాసం వెల్లివిరుస్తాయి. చిరుచలిలో బద్ధకాన్ని వదుల్చుకొని చేసే స్నానం, చిరుదీపాలు నీటి అలల్లో తేలియాడుతుంటే ఉండే సౌందర్యం… ప్రకృతిలో దివ్యత్వాన్ని ప్రతిష్ఠించి ప్రదర్శించే హైందవ మతంలోని దివ్యకళాచాతురిని కొనియాడవలసిందే. కార్తికంలో దేశమంతా ప్రత్యేకంగా ఆధ్యాత్మిక చైతన్యంతో విలసిల్లుతుంది. ఎవరికి తగ్గ నియమాన్ని వారు పాటిస్తూ దైవాన్ని కొలుచుకుంటారు. కార్తికం దీపానికీ, మాఘం స్నానానికీ, వైశాఖం దానానికి ప్రాధాన్యం.

కృత్తికా నక్షత్రం నాడు పూర్ణిమ ఏర్పడే మాసం కార్తికం.
కృత్తిక అగ్ని నక్షత్రం. అగ్ని యందు ఈశ్వర స్వరూపాన్ని ఆవిష్కరించి ఆరాధించడమే యజ్ఞం. అందుకే వేదాలలో ‘నక్షత్రేష్టి’ అనేది – కృత్తికానక్షత్రంతోనే ప్రారంభమవుతుంది. ఆ యజ్ఞతత్త్వానికి సంకేతంగానే ‘దీపారాధన’ అనేది కార్తికంలో ప్రధానమయ్యింది. కార్తికంలో దీపార్చన, దీపదానం వంటివి – యజ్ఞఫలాలను ప్రసాదిస్తాయి.

భర్తృహరి తన శతకసాహిత్యంలో పరమేశ్వరుని ‘జ్ఞానదీపం’గా అభివర్ణించాడు. ఈ దీపం యోగుల హృదయగృహంలో సుస్థిరంగా దీపిస్తోందని సంభావించాడు.
జ్యోతిర్లింగ స్వరూపుడైన శివునకు ప్రతీకగా ప్రతి దీపమూ ఒక జ్యోతిర్లింగమై భాసిస్తూ, విశ్వవ్యాపకమైన ఈశ్వరజ్యోతిని దర్శించి ఉపాసించమని ఉపదేశించే మాసమిది. ఆనందాలకు ఆహ్వానాలు – ఈ కార్తికదీపం.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *