తండ్రి మీద అభిమానం తో అతను కోరిన యువతిని తల్లిగా స్వీకరించడానికి ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండి పోతానని భీషణమైన ప్రతిజ్ఞ చేసి దేవవ్రతుడు భీష్ముడయ్యాడు.
జీవతమంతా అన్నదమ్ముల పిల్లలు,మనుమలకు ధారపోసాడు.ఎంత గొప్పవాళ్లయినా వాళ్ళకి ఉన్న బలహీనత వల్ల ,తప్పుని ఇష్టం లేకపోయినా సమర్ధించవలసి రావడం వల్ల భీష్ముడు చాలా బాధపడ్డాడు. కోరినపుడు మరణం పొందగలిగిన వరం ఉన్నా ఉత్తరాయణం వరకు ఆగుతానని అనడం లో అసలు అర్ధం ఏమిటి?వీరమరణం పొందినవారందరూ స్వర్గానికే వెళ్తారు కదా? శరీరమంతా శరాలు గుచ్చుకుని బాధిస్తున్నా అంప శయ్యపై భీష్ముడు ఉత్తరాయణం కోసం ఎదురుచూసాడు అనడం కన్నా శరాల బాధని అనుభవిస్తూ తన పాపాన్ని మొత్తం కడిగేసుకున్నాడు అనుకోవాలి.తప్పుని తప్పు అని గట్టిగా చెప్పి ఆపకపోవడం కూడా తప్పే.ఆ మహాత్ముడు తనకు తానుగా విధించుకున్న శిక్ష ఇది.
భారత శిక్షాస్మృతికి బీజం ఇక్కడనుంచే పడిందేమో.నేరాన్ని సమర్ధించకపోయి నా మవునం గా ఉండడం తప్పని.
ఏకాదశినాడు విష్ణు సహస్రనామ పారాయణం చేసి పుణ్యం వస్తుంది అని అనుకోవడం కాదు,ధర్మ మార్గాన నడవాలి ,అధర్మాన్ని సమర్ధించకూడదు అని తెలుసుకుని మంచి మార్గంలో నడవాలి,మనవారిని నడిపించాలి.
పెద్దవారు తప్పు జరుగుతుంటే చూస్తూ ఊరుకోరాదు. అది వంశ నాశనానికి దారి తీస్తుంది అనే సందేశం మనం ఈ రోజు మనకి అందింది అనుకోవాలి.
అదే అంపశయ్య మీద ఇన్నాళ్లు భీష్ముడు బాధ పడడం లో అంతరార్థం. సర్వేజనా సుజనో భవంతు,సుఖినోభవంతు.
“జగత్ ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం
అనాది నిధనం విష్ణుం సర్వ లోక మహేశ్వరం
లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వ దుఃఖాతిగో భవేత్.
ఆది అంతము లేని, సర్వ వ్యాపి అయిన, దేవ దేవుడైన , భగవంతుడైన విష్ణు స్తుతి వల్ల సర్వ దుఃఖములు తోలగుతాయి-
భీష్మ ఏకాదశి రోజున ఉపవాసం చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే మోక్ష ప్రాప్తి కలుగుతుంది. తిలద్వాదశి నాడు నువ్వులతో చేసిన పదార్ధాలను తినడం, నువ్వుల నూనెతో అభ్యంగన స్నానమాచరించడం, నువ్వుల నూనెతో దీపం వెలిగించి దానమివ్వడం చేస్తే కష్టాలు తొలగుతాయి.
ఇకపోతే… శ్రీ విష్ణు సహస్రనామాన్ని భీష్ముడు మాఘ శుద్ధ ఏకాదశి నాడు శ్రీకృష్ణుడికి అంకితమిచ్చాడు. భీష్ముడి శ్రీ విష్ణు సహస్ర నామాలతోనే ప్రస్తుతం కృష్ణుడిని యావత్తు ప్రపంచం ప్రార్థిస్తున్న సంగతి తెలిసిందే.
విష్ణు సహస్ర నామాన్ని రోజూ పఠించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయం కావడంతో పాటు మోక్షం ప్రాప్తిస్తుంది. అలాగే విష్ణు సహస్ర నామాలను చదవకపోయినా.. కనీసం విన్నా కూడా ఈతిబాధలు సులభంగా తొలగిపోతాయని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు